ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సులో.. మోదీ, జో బైడెన్
ప్రజాస్వామ్య స్ఫూర్తి భారత నాగరికతలో మహోన్నతమైన లక్షణమని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుండడం తనకు గర్వకారణమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సదస్సులో వందమందికి పైగా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత, నిజాయతీపర ఎన్నికల నిర్వహణలో భారత నైపుణ్యాలను ప్రపంచానికి పంచడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క వ్యవస్థే కాదు అది ప్రజలతో ఉండి, ప్రజల్లో ఉండే వ్యవస్థ కూడా అని అన్నారు. బహుళ పార్టీలతో కూడిన ఎన్నికలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, పత్రికా స్వేచ్ఛలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని తెలిపారు. ప్రజలు, సమాజంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు. ఇలాంటి లక్షణాలు భారత సమాజంలో ఉన్నాయని అన్నారు. ప్రజా స్వామ్యం అభివృద్ధిని అందజేస్తుందన్నారు. ఇదే భారత్ సాధించిన విజయం అని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వెనక చూపులు చూస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి తమతో కలిసి కృషి చేయాలని ప్రపంచ దేశాలను పిలుపునిచ్చారు. నియంతృత్వ పోకడలకన్నా ప్రజాస్వామ్యమే ఎన్నో రెట్లు మెరుగైనదని నిరూపించాల్సి ఉందని తెలిపారు. అమెరికా వంటి పాత్ర ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఇతర దేశాల నాయకులు ప్రసంగిస్తూ అవినీతి, ఆసమానతలు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ప్రజాస్వామ్యనికి ముప్పుగా పరిణమించాయని తెలిపారు.













