అమెరికాలో కొనసాగుతున్న తుఫాన్ బీభత్సం ..
అమెరికాలో మంచు తుఫాన్ విలయం కొనసాగుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మరణించినవారి సంఖ్య 56 దాటింది. చలిని తట్టుకోలేక కొందరు, విద్యుత్, ఫైర్‌కు సంబంధించిన ప్రమాదాల్లో మరికొందరు మరణించినట్టు అధికారులు తెలిపారు. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నట్టు వెల్లడించారు. మంచు తుఫాన్ వల్ల పైప్లైన్లలో నీరు గడ్డకట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు వివరించారు. హ్యూస్టన్, దక్షిణ టెక్సాస్‌లో పరిస్థితి మరింత దిగజారుతున్నట్టు పేర్కొన్నారు. రోజూవారీ అవసరాలతో పాటు, తాగడానికి కూడా నీళ్లు లేక వేలాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఆహారాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్సాస్ రెస్టారెంట్ అసోసియేషన్ ముందుకొచ్చింది. స్థానిక ప్రభుత్వం కూడా మంచును కాచి ఆ తర్వాత చల్లార్చిన నీటిని వాటర్ బాటిళ్లలో నింపి రోగులకు, చిన్న పిల్లలకు అందిస్తున్నారు.
గత రెండు, మూడు రోజులుగా అంధకారంలో ఉన్న టెక్సాస్‌లోని మెజారిటీ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయినప్పటికీ 3,25,000 ఇండ్లు, వాణిజ్యసంస్థలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. అలాగే లూసియానా, వర్జీనియా, ఓరెగన్ ప్రాంత ప్రజలకు విద్యుత్ కష్టాలు ఇంకా తీరలేదు. పవర్ గ్రిడ్లలో తలెత్తిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు. దవాఖానల్లో రోగుల అవసరాల కోసం జనరేటర్లను అందించినట్టు పేర్కొన్నారు.













