ఇంకా మంచు గుప్పిట్లోనే అగ్రరాజ్యం… కనీవినీ ఎరగని స్థాయిలో
ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుఫాన్ కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతిశీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాను విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్సాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది.













