అమెరికా వైఖరే ఈ దాడులకు కారణం
అమెరికాలోని క్యూబన్ దౌత్య కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే గ్రూపుల పట్ల కఠిన చర్యలు తీసుకోవడంలో అమెరికా అధికారులు విఫలమయ్యారని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్ విమర్శించారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని మంత్రి తెలిపారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి వుందన్నారు. తమకు అమెరికా ప్రభుత్వం నుంచి రక్షణ అందుతుందని భావించినప్పుడు క్యూబా వ్యతిరేక గ్రూపులు ఇటువంటి తీవ్రవాదానికి పాల్పడతాయని, దీని గురించే క్యూబా ఎప్పుడూ హెచ్చరిస్తూ వుంటుందని ఆయన పేర్కొన్నారు. క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్తో సహా ప్రపంచ నేతలందరూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సమయంలోనే ఈ దాడి చోటు చేసుకోవడం గమనార్హం.













