అర్జెంటీనాలో వెల్లువెత్తిన నిరసనలు
అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ తరహాలోనే అర్జెంటీనాలో జరిగిన ఘటనపై ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. గత వారాంతంలో రాజధానిలో శాంతియుతంగా జరిగిన చిన్న ప్రదర్శనపై సిటీ పోలీసులు పైశాచికంగా దాడి చేశారు. ఈ ప్రదర్శన వల్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకున్నా ఒబెలిస్క్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఫకుండో మోలారెస్ను రాజధాని నగర పోలీసులు పట్టుకుని అతని తలను నేలపై గట్టిగా అదిమి చంపారన్న వార్త తెలియగానే అర్జెంటీని ప్రజలు ఆగ్రహావేశాలతో రగలిపోయారు. ఫొటో జర్నలిస్టు మొలారెస్ మృతికి బాధ్యులైన పోలీసులను శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ కేసులో మొలారెస్కు న్యాయం చేయాలని వారు ప్లకార్డులు, బ్యానర్లు ప్ర్రదర్శించారు. ఈ ఉద్రిక్తతల మధ్య అర్జెంటీనాలో ప్రైమరీస్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా రెబెలియన్ పాపులర్ గ్రూప్‌నకు చెందిన కార్యకర్తలు, ఇతర ప్రజాతంత్రవాదులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు.













