ఆ విషయంలో భారత్ ను మించిన తోపుల్లేరు! అమెరికన్ సైంటిస్ట్ పొగడ్త..!
మన గురించి మనం చెప్పుకోవడం కాదు.. పక్కనోడు చెప్తేనే సంతృప్తి. ఇప్పుడు భారత్ విషయంలో అదే జరుగుతోంది. భారత్ ను ఇప్పటికీ చిన్నదేశంగానే, వెనుకబడిన దేశంగానే భావిస్తుంటాయి కొన్ని అగ్రదేశాలు. చాలా చిన్న చూపు చూస్తుంటాయి. కానీ భారత్ సత్తా ఏంటో భారతీయులకు తెలుసు. ప్రపంచంలో కూడా చాలా మందికి తెలుసు. కానీ చెప్పడానికి పెద్దగా మనసు రాదు. కానీ ఇప్పుడు ఓ అమెరికన్ శాస్త్రవేత్త భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు.
కరోనా సంక్షోభం ప్రపంచదేశాలన్నింటినీ వణికించేందుకు ఇంట్లో నుంచి బయటపెట్టనీకుండా చేసింది. ప్రపంచంలో చైనా, భారత్ లే అత్యధిక జనాభా కలిగిన దేశారు. మొత్తం జనాభాలో సగం జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. కరోనా మహమ్మారితో ఈ రెండు దేశాల్లో భారీగా ప్రాణనష్టం ఉంటుందని.. ఈ రెండు దేశాలు తీవ్రంగా నష్టపోతాయని అందరూ భావించారు. అయితే ఈ రెండు దేశాలు మాత్రం కరోనాను కట్టడి చేయడంలో మిగిలన దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.
చైనా సంగతి పక్కనపెడదాం.. భారత్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ. స్వేచ్ఛగా తిరుగుతుంటారు జనం. దీంతో ఇక్కడ కరోనా విజృంభిస్తే దేశం ఏమైపోతుందోనని అందరూ భయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలుమార్లు హెచ్చరించింది. కానీ భారత్ మాత్రం ఏనాడు అలసత్వం వహించలేదు. కరోనాను కట్టడి చేయడంలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లింది. కరోనాను కట్టడి చేయడంలోనే కాదు.. దాన్ని నివారించేందుకు అవసరమైన టీకాలు, ఔషధాల తయారీలోనూ సత్తా చాటుతోంది. ఇదిప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇది మనం చెప్తున్న మాట కాదు.. అమెరికాలో టాప్ మోస్ట్ సైంటిస్ట్ పీటర్ హోటేజ్ ఈ విషయాన్ని ఘనంగా చాటిచెప్పారు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు భారత్ టీకాలను కానుకగా అందించిందని చెప్పారు. బేలర్ కాలజ్ ఆఫ్ మెడిసిన్ లోని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ లో డాక్టర్ పీటర్ హోటెజ్ డీన్ గా పనిచేస్తున్నారు. ఓ విబినార్ లో మాట్లాడిన ఆయన.. కరోనాను కట్టడి చేయడమే కాకుండా ప్రపంచం ఆ మహమ్మారి బారి నుంచి బయటపడేందుకు టీకాల రూపంలో బహుమతి అందించిందని చెప్పారు.
ప్రపంచంలో ఏమూల టీకా అభివృద్ధి చేసినా దాని ఉత్పత్తి మాత్రం భారత్ లోనే జరుగుతుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రపంచానికి అవసరమయ్యే టీకాల్లో 25శాతం భారతే అందిస్తుంది. ఇప్పుడు కూడా బ్రిటన్ లోని అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా టీకాను పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఇక హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ టీకాను అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్పత్తి చేస్తోంది. మరికొన్ని సంస్థల టీకాలు అభివృద్ధి దశల్లో ఉన్నాయి. మన సంస్థలు కేవలం అభివృద్ధి చేయడమే కాకుండా విదేశాలకు కూడా అందిస్తున్నాయి.. అది కూడా చాలా చౌకగా..! దీంతో ప్రపంచ అవసరాలు తీరుతున్నాయి. అందుకే టీకాల్లో మనల్ని మించిన తోపులెవరూ లేరు.













