కోవ్యాక్సిన్.. కరోనా వేరియంట్లనూ నిలువరిస్తుంది: అమెరికా వైద్యసలహాదారు ఫాసీ

వాషింగ్టన్: భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కోవ్యాక్సిన్.. కొత్తగా వెలుగు చూసిన 617 కరోనా వేరియంట్‌పై కూడా పనిచేస్తుందని అగ్రరాజ్యం అమెరికా వైద్య సలహాదారు, టాప్ ప్యాండెమిక్ నిపుణులు డాక్టర్ ఆంథనీ ఫాసీ వెల్లడించారు. మంగళవారం నాడు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. తాము ఈ విషయంపై మరింత డేటాను సేకరిస్తున్నామని, అయితే తాజాగా అందిన సమాచారం మేరకు కరోనా 617 వేరియంట్‌పై కూడా భారత కోవ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని ఫాసీ స్పష్టంచేశారు. కాబట్టి భారత్‌లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కూడా వ్యాక్సినేషన్ ద్వారా దాన్ని చక్కదిద్దవచ్చని, ప్రస్తుత పరిస్థితిని ఎదుక్కోవడానికి ఇదే అత్యుత్తమ మార్గమని ఆయన తెలిపారు. శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థకు యాంటీ బాడీలు ఎలా తయారు చేసుకోవాలో కోవ్యాక్సిన్ నేర్పుతుందని, తద్వారా వైరస్‌తో పోరాడుతుందని కొందరు నిపుణులు వెల్లడించారు. కాగా జనవరి 3న భారత్‌లో అత్యవసర వినియోగానికి కోవ్యాక్సిన్ అనుమతులు పొందింది. భారత్ బయోటెక్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. మూడో దశ ట్రయల్స్ ఫలితాల్లో ఈ వ్యాక్సిన్ 78శాతం సక్సెస్ రేట్ కలిగి ఉన్నట్లు తేలింది.