సర్వ్ చేసిన యువతికి రూ.9.50 లక్షల టిప్!
న్యూయార్క్ లో తనకు సర్వ్ చేసిన ఓ యువతికి ఓ కస్టమర్ ఏకంగా 13 వేల డాలర్లు (దాదాపు రూ.9.42 లక్షలు) టిప్ గా ఇచ్చి ఆమెను అవాక్కు చేశాడు. న్యూయార్క్ లో లిల్లీస్ కాక్ టైల్ రెస్టారెంట్ పేరిట ఓ హోటల్ ఉండగా, అక్కడ ఉల్యానా హ్రుచాక్ అనే యువతి వెయిట్రెస్ గా పని చేస్తోంది. ఆ హోటల్‌కు రెగ్యులర్ గా వెళ్లే రాబిన్ స్కాల్ అనే కస్టమర్ ఆమెను చూసి, ఆమెకేదైనా సాయం చేయాలని భావించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 1.41 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, వారందరికీ ఆమె గురించి చెప్పి, ఎంతో కొంత సాయం చేయాలని, తాను ఆమెకు డబ్బులు ఇచ్చి సాయపడతానని కోరాడు.
ఈ పోస్ట్ పెట్టే సమయంలో ఓ 1000 డాలర్ల నిధిని సేకరించి, ఆమెకు ఇచ్చినా తనకు సంతోషమేనని రాబిన్ భావించాడు. అయితే నిమిషాల వ్యవధిలోనే 13 వేల డాలర్లు పోగయ్యాయి. దీంతో ఆ డబ్బును తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లిన రాబిన్ స్కాల్, ఆమెకు మొత్తం తాను సేకరించిన మొత్తాన్ని టిప్ గా ఇచ్చి వచ్చాడు. తొలుత నమ్మలేకపోయినా, ఆపై విషయం తెలుసుకున్న ఆమె, స్కాల్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఫాలోవర్లకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.













