అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన చైనా…ఎందుకో
అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాడ్ కూటమిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. వీలైతే ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు సహకరించండని సూచించింది. ఈ మేరకు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ డిఫెన్స్‌లోని సీనియర్ కర్నల్ రెన్‌గావ్‌కియాంగ్ పేర్కొన్నారు. క్వాడ్ సమావేశంలో తాము చైనా విసురుతున్న సవాళ్లపై చర్చించినట్లు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇండో, పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత కోసం తాము ప్రయత్నిస్తామని ఈ మధ్యే జరిగిన తొలి క్యాడ్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన విషయం తెలిసిందే.
ఈ క్యాడ్ కూటమిని తాము వ్యతిరేకిస్తున్నట్లు రెన్ స్పష్టం చేశారు. అమెరికా ప్రమోట్ చేస్తున్న ఈ క్యాడ్ వాళ్ల కోల్డ్ వార్ మనస్తత్వానికి అద్దం పడుతోందని ఆయన అన్నారు. ఇది ఒక జట్టుగా ఘర్షణకు దిగడమే అవుతుంది. క్యాడ్ భౌగోలిక రాజకీయ ఆటలకు తెరలేపింది. చైనా సవాలు పేరుతో ఇలా సమూహాలను ఏర్పాటు చేస్తున్నారు. చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని రెన్ అన్నారు. ఈ కాలంలో శాంతి, అభివృద్ధి, ఇరు వర్గాల లబ్ధి పొందడమే లక్ష్యంగా పని చేయాలని, అలా కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ట్రెండ్‌కు విరుద్ధంగా వెళ్లడం సరి కాదని ఆయన స్పష్టం చేశారు. తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అమెరికా అందరినీ శత్రువులగా మార్చుకోవడం, లేని ముప్పును ఊహించుకోవడం చేస్తోందని రెన్ విమర్శించారు.













