భద్రతా మండలిలో అమెరికాకు.. భంగపాటు
ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో యత్నించిన అమెరికాకు భంగపాటు ఎదురైంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని చైనా, రష్యా వీటో చేశాయి. కోవిడ్ 19పై పోరాడుతున్న ఉత్తర కొరియాకు మానవతా, కోవిడ్ నిరోధక సాయం అందించడానికి బదులు ఆంక్షలు విధించడం తగదని రష్యా, చైనా వాదించాయి. ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించినందున ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు సిద్దమైన పశ్చిమ దేశాల వైఖరి ఏకపక్షంగా ఉందని చైనా విమర్శించింది. సమగ్ర అణు పాటవ పరీక్షా నిషేధానికి అందరూ కట్టుబడి ఉండేలా చూడాలే తప్ప కొన్ని దేశాల పట్ల ఒక వైఖరి, మరి కొన్ని దేశాల పట్ల ఇంకొక వైఖరి ఎందుకని భద్రతా మండలిలో చైనా రాయబారి జాంగ్ జాన్ వాదించారు. ఈ సమస్యకు ఆంక్షలు పరిష్కారం కాదని, రాజకీయ పరిష్కారమే సరైన మార్గమని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఉత్తర కొరియాపై అదనపు ఆంక్షలు విధించడం సమస్య పరిష్కారానికి ఏమాత్రం దోహదపడదని అన్నారు. ప్రత్యేకించి కొవిడ్ పెద్దయొత్తున విరుచుకుపడిన ఈ స్థితిలో ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు విధించడమంటే మానవీయ సంక్షోభం వైపు ఆ దేశాన్ని నెట్టడమే అవుతుందని చైనా రాయబారి పేర్కొన్నారు.













