ఇండో అమెరికా సైనిక విన్యాసాలపై.. చైనా అభ్యంతరం
భారత్-చైనా సరిహద్దు వివాదాల విషయంలో తృతీయ పక్షం జోక్యం తగదని డ్రాగన్ మరోసారి పేర్కొంది. భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలకు కట్టుబడి, వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి సైనిక విన్యాసాలు చేపట్టకూడదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్, అమెరికాలు ఉత్తరాఖండ్‌లోని ఔలిలో అక్టోబరు 14 నుంచి 31 వరకూ సంయుక్త సైనిక విన్యాసాలు (యుథ్ అభ్యాస్) చేపట్టనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా రక్షణశాఖ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే డ్రాగన్ అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు పూర్తిగా భిన్నమైనవని, వీటి వల్ల ద్వైపాక్షిక ఒప్పందాలకు జరిగే ఉల్లంఘన ఏమీ లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.













