మీ పప్పులు మా దగ్గర ఉడకవు ..అమెరికాను ప్రశ్నించిన చైనా
తైవాన్లో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు పర్యటించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ ఏర్పాటువాదులతో కుమ్మక్కు కావడం ద్వారా నిప్పుతో చెలగాటమాడుతున్నారని అమెరికాను చైనా తీవ్రంగా హెచ్చరించింది. మీ పప్పులు మా దగ్గర ఉడకవని తేల్చి చెప్పింది. ఇప్పటికైనా ఇటువంటి హానికరమైన కవ్వింపు చర్యలను మానుకుంటే మంచిదని హితవు పలికింది. తైవాన్ వేర్పాటువాదులతో చేతులు కలపడం ప్రమాదకరమైన క్రీడ. నిప్పుతో చెలగాటమాడితే ఆది చివరికి వారినే దహించివేస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బెన్ తెలిపారు.
అమెరికన్ ఎంపీల బృందం మంగళవారం యుఎస్ నావికాదళానికి చెందిన విమానంలో రహస్యంగా వచ్చారు. అమెరికా తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తైవాన్ సంబంధాల చట్టం కింద ఇటువంటి పర్యటనలు జరపడం మామూలేనని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్పీ అన్నారు.













