గల్ఫ్ వెళ్లే కార్మికుల వేతనాల్లో కోతకు ఉత్తర్వులు.. గల్ఫ్ కార్మికుల పొట్ట కొడుతున్న కేంద్రం : మహేష్ బిగాల
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారత కార్మికుల శ్రమను గుర్తించి వారికి తగిన వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వాలకు సూచించాల్సిన మన విదేశాంగ శాఖ, కార్మికులకు నష్టం కలిగించేలా ఉత్తర్వులను జారీ చేసిందని మహేష్ బిగాల (ఎన్నారై కో-ఆర్డినేటర్) అన్నారు. గల్ఫ్ దేశాలకు సంబంధించి కార్మికుల ఇమ్మిగ్రేషన్ విధానంలో కనీస వేతనాల కుదింపుపై అక్కడి ప్రభుత్వాలకు భారత్ సమ్మతి తెలిపిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సంఘాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎడారి దేశాల్లో కనీస వేతనాలు అమలు కావట్లేదని బాధపడుతున్నారు. అలాంటిది మన దేశ ప్రభుత్వమే తక్కువ వేతనానికి సిఫారసు చేస్తే, గల్ఫ్ కంపెనీలు మన కార్మికుల కడుపు కోత మిగిల్చింది అని మహేష్ బిగాల అన్నారు. దీని వల్ల కోటి మందికి పైగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.













