కెనడా కీలక నిర్ణయం.. వారికి ఆహ్వానం
పలు రంగాల్లో కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య రంగంలో పనిచేయడానికి అభ్యర్థులను తమ దేశానికి ఆహ్వానిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు 500 ఇన్విటేషన్ టు అప్లై (ఐటీఏ)లను విడుదల చేస్తున్నట్లు దేశ ఇమిగ్రేషన్ శాఖ మంత్రి సియాన్ ఫ్రాసర్ ప్రకటించారు. ఫ్రెంచి భాష వచ్చిన వారికి వీసా జారీలో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్‌లో హెచ్ 1బీ వీసా ఉన్న వృత్తి నిపుణులు 10 వేల మందికి వర్క్ పర్మిట్ వీసా ఇస్తామని కెనడా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల భారతీయులకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశముంది. తాజా ప్రకటనతో కెనడా జారీ చేసిన ఐటీఏల సంఖ్య 60,249కి చేరింది.













