ఇందులో భారత్ కూడా ఉండాలి… ప్రపంచ దేశాలకు బ్రిటన్ పిలుపు
ఉక్రెయిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా వీలయినంత పెద్ద కూటమి ఏర్పాటు కావాలని బ్రిటన్ పిలుపునిచ్చింది. ఇందులో భారత్ కూడా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఉక్రెయిన్ నగరాలపై పుతిన్ దాడులను విశ్వవ్యాప్తంగా ఖండించాలంటూ ప్రపంచ నేతలను కోరుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలోనే ఫోన్లో మాట్లాడే అవకాశం ఉందని జాన్సన్ అధికార ప్రతినిధి తెలిపారు. అన్ని దేశాలూ రష్యా అధ్యక్షుడికి సాధ్యమైనంత స్పష్టమైన సందేశం పంపించేలా ఏకతాటిపైకి రావాలన్నదే బ్రిటన్ లక్ష్యమని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంపై దురాక్రమణకు పాల్పడటాన్ని ఖండిరచడానికి అన్ని దేశాలూ అంగీకరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా భారత్, బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సంబంధించి అధికారుల మధ్య రెండో విడత చర్చలు వచ్చే వారం నుంచి జరుగుతాయని బ్రిటన్ తెలిపింది.













