భారత్ కు బ్రిటన్ ప్రధాని… ఎట్టకేలకు పర్యాటన ఖరారు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలాఖర్లో ఆయన భారత పర్యటనకు వచ్చే అవకాశముంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకే అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు బ్రిటన్ సన్నాహాలు చేస్తోంది. కాగా, యూరోపియన్ యూనియన్ (ఐరోపా దేశాల సమాఖ్య) నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ఆ దేశ ప్రధాని తొలి విదేశీ పర్యటన ఇదే కానుంది. ఇప్పటికే జనవరిలో భారత గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధానిని ఇండియా ఆహ్వానించింది. కానీ కరోనా వైరస్ కేసుల ఉధృతి నేపథ్యంలో అప్పుడు పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ ఏడాది జూన్లో బ్రిటన్లో నిర్వహించే జీ7 సదస్సుకు ప్రధాని మోదీని హాజరుకావాల్సిందిగా యూకే ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే జీ7 సదస్సుకు ముందే భారత పర్యటనకు బోరిస్ రానున్నట్లు అక్కడి వార్త సంస్థలు పేర్కొన్నాయి. మేం ఆస్ట్రేలియా, యూఎస్ సహా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇండోపిసిఫిక్ ప్రాంతం ఎంతో కీలకం. భవిష్యత్తులోఈ ప్రాంతం వాణిజ్య పరంగా అభివృద్ధికి కేంద్రం కానుంది అని బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ గతంలో వెల్లడించారు.













