అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న మోన్రో సరస్సులో ఈతకు వెళ్లి గల్లంతైన భారత్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. సిద్ధాంత్ షా (19), ఆర్యన్ వైద్య (20)లు తమ స్నేహితుల బృందంతో కలిసి ఏప్రిల్ 15న ఇండియానా పోలీస్‌కు దాదాపు 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోన్రో సరస్సులో బోటింగ్‌కు వెళ్లారు. వారి బృందం బోటింగ్ చేస్తున్నప్పుడు ఒకచోట సిద్ధాంత్ షా, ఆర్యన్ వైద్యలు ఈతకు దిగారు. నీటిలోకి దిగిన వారిద్దరూ మళ్లీ తిరిగి రాలేదు. వారిని కాపాడటానికి స్నేహితులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గల్లంతైన వారి కోసం రెండు రోజుల పాటు గాలించగా, వారి మృతదేహాలు 18 అడుగుల లోతులో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ ఇండియానా యూనివర్సిటీ కెల్లి స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నారు.













