ఉక్రెయిన్ పై మీరు ఎన్నటికీ గెలవలేరు: బైడెన్
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ ప్రజాస్వామ్యాల పరిరక్షణలో తమ సంకల్పం మరింత బలోపేతమయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. మున్ముందు కఠినమైన, గడ్డురోజులు ఉన్నాయని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని, మిత్రపక్షాలతో కలిసి ఆ దేశానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా ఎన్నటికీ విజయం సాధించలేదన్నారు. ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటనకు వెళ్లిన బైడెన్ పోలండ్ ప్రజలతో పాటు ఉక్రెయిన్ శరణార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ బలంగా, సగర్వంగా నిలుస్తోందని అన్నారు. తొలుత ఆయన పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుదాతో భేటీ అయ్యారు. ఐరోపా అంతా భద్రత కలిగి ఉండాలని చెప్పారు. నాటో కూటమి మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని అన్నారు. అమెరికాకు పోలండ్, నాటో ఎంత అవసరమో, నాటోకు అమెరికా అంత అవసరమని అన్నారు.













