జో బైడెన్ పొరపాటు… కెనడాకు బదులుగా చైనా
అమెరికా, చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అలాంటిది ఏకంగా అమెరికా అధ్యక్షుడే చైనాను ప్రశంసించడం గమనార్హం. అది కెనడా పార్లమెంటు వేదికగా అయితే కెనడాకు బదులుగా ఆయన చైనా అని పొరపాటుగా పలకడమే దీనికి కారణం. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం జో బైడెన్ తొలిసారి కెనడాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కెనడా పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కెనడా వలస విధానాలపై మాట్లాడుతూ పొరపాటున చైనాను మెచ్చుకున్నారు. వలసల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నందుకు చైనాను అభినందిస్తున్నా అని వ్యాఖ్యానించారు. వెంటనే జరిగిన పొరపాటుకు నాలుక కర్చుకున్న బైడెన్ క్షమించండి. కెనడాను అభినందిస్తూన్నా అని అన్నారు. దీంతో పార్లమెంటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. తన పొరపాటును సరిదిద్దుకుని,చైనా గురించి నేనేం ఆలోచిస్తున్నానో మీరు చెప్పగలరు. ఇంకా ఈ విషయంలో వెళ్లదల్చుకోలేదు అంటూ బైడెన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.













