కిమ్ జోంగ్ ఉన్‌తో అధ్యక్షుడి సమావేశం లేదు!
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావించడం లేదని వైట్‌హౌస్ తెలిపింది. ఉత్తర కొరియా పట్ల బైడెన్ అనుసరించే దౌత్య వైఖరిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ జరిపినట్లుగా కిమ్‌తో సమావేశముంటుందా అని ప్రశ్నించగా వైట్‌హౌస్ కార్యదర్శి జెన్ సాకి పై సమాధానమిచ్చారు. బైడెన్ వైఖరి భిన్నంగా వుండనుందని చెప్పారు. గత వారం ఉత్తర కొరియా కొత్త తరహా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. దీంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అమెరికా కోరింది.
ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించడం నిషేధం. అణు శీర్షాలతో కూడిన రాకెట్లను అభివృద్ధి పరచడాన్ని కొనసాగిస్తున్నందుకు గతంలో ఉత్తర కొరియాపై కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు విధించారు. ఈ పరీక్షలు జరిపినా ఉత్తర కొరియాతో దౌత్య కార్యకలాపాలు చేపట్టేందుకు అమెరికా కట్టుబడి వుందని బైడెన్ చెప్పారు. కానీ ఉద్రిక్తతలు రెచ్చ గొట్టేలా ప్యాంగాంగ్ వ్యవహరించిన పక్షంలో తీత్ర పర్యవసానాలు వుంటాయని హెచ్చరించారు. ఆత్మరక్షణ కోసం తాము చేసిన క్షిపణి పరీక్షను విమర్శించడం ద్వారా బైడెన్ ప్రభుత్వం తొలి అడుగే తప్పుగా వేసిందని ఉత్తర కొరియా విమర్శించింది.













