అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కుటుంబంలో విషాదం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన నాన్నమ్మ మామా సారా ఒబామా కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కెన్యాలోని కిసుము నగరంలో గల జరమోగి ఒడింగా ఒడింగా టీచింగ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఒబామా తండ్రికి పినతల్లి అయిన మమా సారా సంఘ సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనాథలు, బాలికలకు విద్యను అందించడానికి ఆమె ఎంతో కృషి చేశారు. ఒబామా తండ్రి సీనియర్ ఒబామాను స్కూల్కు తీసుకెళ్లడానికి ఆమె రోజూ తొమ్మిది కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కేవారట. తమ స్వగ్రామం కోగెలో నుంచి ఎన్జీయా నగరానికి ఆయనను తీసుకెళ్లి చదువు చెప్పించేవారట.
నాన్నమ్మ మరణంపై ఒబామా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన తల్లి మరణంపై ఆమె కూతురు మర్శత్ ఓన్యాంగో భావోద్వేగానికి గురయ్యారు. సారా ఒబామా 1922లో లేక్ విక్టోరియాలో జన్మించారు. బరాక్ ఒబామా తాత గారు హుస్నేన్ ఓన్యాంగో ఒబామా మూడో భార్య ఈ సారా ఒబామా. సారా ఒబామా ఫౌండేషన్ పేరిట ఆమె అనాథ పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. రక్త సంబంధం లేకపోయినప్పటికి ఒబామా ఆమెను చాలా ఆప్వాయంగా చూసుకునేవారు. 2006లో కెన్యా వెళ్లిన ఆయన సారా ఇంటికి వెళ్లారు. ఆమెను తన బామ్మ అంటూ అందరికీ పరిచయం చేశారు. ఆ తర్వాతే ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. మమా సారా మృతికి కిసుము నగర గవర్నర్ అన్యాంగ్ న్యోంగో సహా పలువురు సంతాపం తెలిపారు.













