భారత్ సహా అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా… దేశాలకు కూడా
భారత్ సహా మరో మూడు దేశాల ఉన్నత దౌత్యాధికారులకు అదనపు భద్రతా ఎస్కార్టు సేవలను నిలిపేస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమిన్ ప్రకటించారు. భారత్, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా దేశాల దౌత్యాధికారులు నగరంలో ప్రయాణిస్తున్నప్పుడు బంగ్లా పోలీసులు వ్యాన్లలో వారిని అనుసరిస్తూ భద్రత కల్పిస్తుంటారు. 2016 జూలై 1న ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిలో ఒక భారతీయ యువతితో పాటు మొత్తం 20 మంది విదేశీయులు మరణించినప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దేశంలో శాంతిభద్రతలు మెరుగుపడినందున ఇకపై తమ ప్రజలు చెల్లించిన పన్నులతో దౌత్యాధికారులకు అదనపు భద్రత కల్పించే పద్ధతికి స్వస్తి చెబుతున్నామని డాక్టర్ మోమిన్ తెలిపారు. అయితే దౌత్యాధికారులకు సాధారణ బందోబస్తు కొనసాగుతుందని ఢాకా నగర పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.













