అమెరికాలో కరోనా మరణాలపై… ఫౌసీ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో కరోనా మరణాల లెక్కలపై ఆ దేశానికి చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనియో ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో వాస్తవంగా సంభవించిన మరణాల కంటే అమెరికా తక్కువగా లెక్కలు చూపిందని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ తప్పుడు లెక్కలు తాను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయని ఆయన అన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 5 లక్షల 81 వేల మందికి పైగా మరణించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 9 లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ విడుదల చేసిన అధ్యయన నివేదికలో పేర్కొంది. అమెరికాలో 3.26 కోట్ల మందికి కరోనా సోకింది. ఏడాది ముగింపు సెలవుల నేపథ్యంలో అక్కడ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టడంతో ఈ ఏడాది జనవరి నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి.