కాప్ 28 సదస్సులో అనూహ్య పరిణామం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా కాప్ 28 ప్రపంచ వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ ఐరాస ఉన్నతస్థాయి కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 12 ఏళ్ల భారతీయ బాలిక వేదికపైకి దూసుకొచ్చి, శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి. మన భూగ్రహాన్ని భవిష్యత్తును రక్షించండి అని ప్లకార్డు ప్రదర్శించింది. మణిపుర్‌కు చెందిన ఆ చిన్నారి పేరు లిసిప్రియా కుంగుజం. ఆమె శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తోంది. తాజాగా దుబాయ్ వేదికగా జరుగుతోన్న కాప్ సదస్సులో కూడా తన గళాన్ని వినిపించింది. వీక్షకుల మధ్య నుంచి లిసిప్రియా ప్లకార్డు పట్టుకొని వేగంగా వేదికపైకి దూసుకెళ్లింది. ప్లకార్డును ప్రదర్శించి మాట్లాడింది. అయితే కొద్దిసేపటి తర్వాత సిబ్బంది వచ్చి ఆమెకు సర్దిచెప్పి కిందకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వారి మాట వినకుండా అటూ ఇటూ తిరిగుతూ తన ప్రసంగాన్ని కొనసాగించింది. తర్వాత సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.













