వైట్ హౌస్ లో కరోనా భయం
అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం ఇప్పుడు కరోనా వార్డుగా మారిపోయింది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో వైరస్ని తేలిగ్గా కొట్టి పారేసినా ఇప్పుడు ఆయనే కరోనా బారినపడి వైద్యం పొందుతున్నారు. కోవిడ్ నయం కాకుండానే ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన ట్రంప్ ఐసోలేషన్ నియమాలను పాటించకపోవడంతో సిబ్బంది భయ భ్రాంతులకు గురౌతున్నారు. ఈ వారంలో వైట్ హౌస్ లో డజనుకిపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వైట్ హౌస్ హాట్ స్పాట్ గా మారింది. వైట్ హౌస్ లో పనిచేసే చాలా మంది సిబ్బంది ఒకప్పుడు వైట్ హౌస్ ను సురక్షిత ప్రాంతంగా భావించేవారు. కానీ, అధ్యక్షుని ఆరోగ్యంపై విడుదలవుతున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆయన సిబ్బంది భయపడుతున్నారు. సీక్రెట్ సర్వీసెస్ సిబ్బందితో ఎంత మందికి కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని చెప్పడానికి వారు నిరాకరించారు.






