దేశంలో కరోనా విలయానికి కారణాలేంటి?

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదారు వారాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మే మధ్యకాలం నాటికి కేసులు పీక్ స్టేజ్ కు వెళ్తాయని భావిస్తున్నారు. బహుశా ఆ సంఖ్య ఇప్పటికి మూడింతలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే మూడున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. అలాంటి మూడింతలు పెరగడం అంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. అయితే ఎందుకిలా జరిగుతోంది.. అనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మనది రెండో స్థానం. చైనా తర్వాత ఎక్కువ మంది జనాభా ఉండేది మన దేశంలోనే. అత్యధిక జనాభా కలిగిన చైనాలోనే కరోనా వైరస్ పుట్టింది. అది అక్కడ కేవలం ఒక్క నగరానికే పరిమితమైంది. అది కూడా ఐదారు నెలలు మాత్రమే. మొత్తం కేసులు కూడా లక్షలోపే. ఆ తర్వాత చైనాలో కేసులు నమోదైనట్లు బయటి ప్రపంచం చూడలేదు. చైనా కేసులు బయటకు చెప్పట్లేదనే వాదనలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే.. లాక్ డౌన్ ద్వారా భారత్ సమర్థంగా కరోనాను కట్టడి చేయగలిగిందని.. లేకుంటే అత్యధిక జనాభా కలిగిన దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉండేవని అందరూ ఊహించారు. అయితే మొదటి వేవ్ ను భారత్ చాలా పక్కాగా ఎదుర్కొంది. భారత్ సేఫ్ అని అందరూ భావించారు.
అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది. సెకండ్ వేవ్ కుమ్మేస్తోంది. అంచనాలకు ఏమాత్రం అందట్లేదు. ఫస్ట్ వేవ్ లో అమెరికా చవిచూసిన పరిస్థితులు ఇప్పుడు భారత్ చూస్తోంది. అంతకుమించిన కేసులు నమోదవుతాయనే ఆందోళన కూడా ఉంది. మరి ఎందుకిలా జరుగుతోంది.. ఒక్కసారిగా భారత్ లో కేసులు విజృంభించడానికి కారణమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దేశంలో కరోనా మళ్లీ విజృంభించడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది లాక్ డౌన్ సడలింపులను త్వరగా ఇచ్చేయడం. గతేడాది మార్చిలో భారత్ లో లాక్ డౌన్ మొదలైంది. జూన్ నుంచి స్లోగా సడలింపులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్/ అక్టోబర్ నాటికి నార్మల్ లైఫ్ వచ్చేసింది. కరోనా వైరస్ పారిపోయిందని అందరూ విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారు. కరోనా నిబంధనలు పట్టించుకోవడం మానేశారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులుగుంపులుగా తిరగడం ప్రారంభించారు.
ఇక రెండోది అలసత్వం. కరోనా మనల్నేమీ చేయదనే భరోసా పెరిగిపోయింది. మంచిగా తింటే సరిపోతుంది.. వైరస్ మన దరిచేరదని భావించారు. అయితే సత్తా ఉన్నవాళ్ల ద్వారా మరింతమందికి వైరస్ వ్యాపించి వృద్ధులు, వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఫస్ట్ వేవ్ లో అందరూ మడికట్టుకు కూర్చోవడంతో కేసులు త్వరగా అదుపులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు మధ్యవయస్కులకే ఎక్కువగా కరోనా సోకుతోంది. వాళ్ల నుంచి మిగిలిన అన్ని వయసుల వారికీ వ్యాపిస్తోంది. దీంతో కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు రావడం.. పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల మాటున వైరస్ ను పట్టించుకోవడం మానేశాయి. దీంతో వైరస్ చాపకింద నీరులా చుట్టేసింది. రక్షణాత్మక విధానాన్ని విస్మరించడంతో వైరస్ కు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. విదేశీ మీడియా మొత్తం ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. శెభాష్ భారత్ అని పొగిడిన మీడియానే ఇప్పుడు భారత్ లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. భారత్ మిగిలిన దేశాలకు ఒక పెద్ద గుణపాఠం అని చెప్తున్నాయి.