డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌లకు కరోనా వైరస్ సంక్రమించింది. వారిద్దరూ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. త్వరలోనే క్వారెంటైన్ పక్రియను మొదలుపెట్టనున్నట్లు ట్రంప్ తన ట్విట్టర్లో వెల్లడించారు. తక్షణమే రికవరీ పక్రియను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైరస్ బారి నుంచి త్వరలోనే విముక్తి చెందుతామని కూడా ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు కరోనా సంక్రమించింది. ఆమె పాజిటివ్‌గా తేలడంతో అధ్యక్ష సిబ్బంది మొత్తం అప్రమత్తమైంది. ట్రంప్ దంపతులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష ఫలితాలు రాకముందే ట్రంప్ దంపతులు క్వారెంటైన్ పక్రియను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
తాను బాగానే ఉన్నానని, అధ్యక్షుడిగా తన బాధ్యతలను ఏ అంతరాయం లేకుండా నిర్వహిస్తానని ట్రంప్ వివరించారు. అందరం కలిసి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని ఆయన అమెరికన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటున్నట్టు మెలానియా తెలిపారు. అందరూ అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ఆమె కోరారు. ట్రంప్ దంపతుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వారు శ్వేత సౌధంలో క్వారంటైన్ కాలాన్ని గడపనున్నారని వైద్యుడు సీన్ కాన్లే ప్రకటించారు.






