అగ్రరాజ్యంలో ఏడు లక్షలు దాటింది…

అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం గడిచిన 108 రోజుల్లోనే ఆ దేశంలో కొత్తగా లక్ష మందిపైగా మరణించారు. ఇటీవల అమెరికాలో మళ్లీ వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు విపరీతంగా పెరిగాయి. డెల్టా వేరియంట్ ప్రబలడం వల్ల మరణాల సంఖ్య వేగంగా పెరిగింది. వ్యాక్సిన్ వేయించుకోని వారి సంఖ్య కూడా ఇంకా అధికంగానే ఉన్నది. తాజా మరణాల సంఖ్యను పరిశీలిస్తే, అమెరికాలో ఇంకా హెచ్చు స్థాయిలోనే కోవిడ్ వల్ల మరణాలు సంభవిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇన్‌ఫెక్షన్లు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అమెరికాలోని అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల గవర్నర్లు ప్రజలను వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంకరేజ్ చేస్తున్నారు. విద్యార్థులు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తెలిపారు.