కరోనా టీకా తీసుకున్న ఐరాస సెక్రటరీ జనరల్

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తొలి డోసు కోవిడ్ 19 టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా కరోనా టీకాను తీసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోట వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వాలకు సూచించారు. 71 ఏళ్ల గుటెర్రస్, న్యూయార్క్ నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం చేతితో విజయం చిహ్నం చూపుతున్న ఓ వీడియోను ఆయన సామాజిక మాద్యమాల్లో షేర్ చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి సిబ్బంది, దౌత్యవేత్తలకు భాగం కల్పించినందుకు న్యూయార్క్ నగరానికి కృతజ్ఞతలు. కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధంలో పరస్పర సహకారం అతి కీలకం అని వ్యాఖ్యానించారు.