కరోనా చికిత్సకు కొత్త మాత్ర

కరోనా మహమ్మారికి టాబ్లెట్ రూపంలోని మరో మందు కూడా అందుబాటులోకి వచ్చింది. మాల్నుపిరవిర్ పేరుతో తయారైన ఈ యాంటీ వైరల్ పిల్‌ను మెర్క్, రిట్జ్ బ్యాక్ బయోథెరపిటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పిల్ వినియోగానికి బ్రిటన్ దేశం ఆమోదముద్ర వేసింది. ఈ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం బ్రిటనే కావడం గమనార్హం. ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించిన లేదా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన ఐదు రోజుల్లోగా ఈ పిల్ ను వాడేందుకు ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. మరోవైపు 4.80 లక్షల కోర్సుల పిల్స్‌ను కొనుగోలు చేసేందుకు గత నెలలోనే బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా ఒక కోటీ కోర్సుల పిల్స్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ధారించుకున్నామని మెర్క్ తెలిపింది. ఈ పిల్‌కు ఆమోదం తెలపడంపై అమెరికా ఈ నెలలో నిర్ణయం తీసుకోనుంది.