టీకా ముందుగా అమెరికన్ లకే… ఆ తర్వాతే ఇతర దేశాలకు

కరోనా వ్యాక్సిన్ అందజేత విషయంలో తొలుత అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ తర్వాతే ఇతర దేశాలకు సహాయం చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. అవసరమైతే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొస్తామని ట్రంప్ తెలిపారు. తద్వారా తొలుత అమెరికన్లకే వ్యాక్సిన్ అందేలా చూస్తామన్నారు. ఈ చట్టం ద్వారా దేశంలోని ప్రైవేట్ తయారీ సంస్థలు ఉత్పత్తిని వేగవంతం చేసి అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించే అధికారం అధ్యక్షుడికి దఖలు పడుతుంది.
త్వరలో కరోనా వైరస్‍ను అంతం చేయబోతున్నామని ట్రంప్ అన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు నిలవబోతున్నాయన్నారు. టీకా అభివృద్ధి, సమన్వయం కోసం తాను ప్రారంభించిన ఆపరేషన్ వార్ప్ స్పీడ్ వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం కింద పెట్టిన పెట్టుబడుల వల్లే ఫైజర్, మోడెర్నా టీకాలు 95శాతం సమర్ధతను చూపగలిగాయని చెప్పారు. త్వరలో మరికొన్ని దేశాలూ తమ వ్యాక్సిన్ సమర్ధతపై ప్రకటన చేయనున్నాయన్నారు. అతిత్వరలోనే ఫైజర్ టీకాకు, ఆ వెంటనే మోడెర్నా టీకాకు ఎఫ్‍డీఏ అనుమతులిస్తుందని తాను భావిస్తున్నానన్నారు. త్వరలోనే అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయన్నారు.