కరోనాతో మధుమేహులకు ఎక్కువ ప్రమాదం
దిల్లీ: కరోనా వైరస్ సోకిన మధుమేహ బాధితులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. వీరికి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం, కొన్ని మందులను ఆపేయాల్సి రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు. దిల్లీ ప్రభుత్వం.. హైకోర్టుకు సమర్పించిన సీరోలాజికల్ సర్వైలెన్స్ నివేదిక ఈ మేరకు చెబుతోంది.
ఊపిరితిత్తులతోపాటు క్లోమంపై కూడా కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని నిపుణులు వివరించారు. కొందరు రోగుల్లో దీనివల్ల పాంక్రియాటైటిస్ తలెత్తుతోందన్నారు. క్లోమం.. ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఈ హార్మోన్ నియంత్రిస్తుంది. అయితే వైరస్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా వీరిలో చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. అందువల్ల కరోనా సోకిన అనేక మంది.. మొదటిసారిగా మధుమేహం బారిన పడుతున్నారని వైద్యులు తెలిపారు. భారత్‌లోని మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో ఎక్కువ మందికి ఊబకాయం, ఇతర సమస్యలు ఉంటున్నాయన్నారు. వీరు కరోనా బారిన పడితే.. బరువు తగ్గించడానికి, చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఉద్దేశించిన ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్లు, ఇతర ఔషధాలను ఇవ్వడం కుదరదని చెప్పారు. దీనివల్ల వారిలో మధుమేహం స్థాయి పెరుగుతుందన్నారు. కొవిడ్-19 కారణంగా బాధితుల్లో ఒత్తిడి తలెత్తుతుందని, ఫలితంగా చక్కెర స్థాయి పెరుగుతుంటుందని చెప్పారు. ఇలాంటివారికి చికిత్స చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.






