ఆక్సిజన్ సరఫరాపై 12 మందితో టాస్క్‌ఫోర్స్‌ను ప్రకటించిన సుప్రీం

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ పెరగడం… కోవిడ్ రోగులకు అందక మరణించడం దేశంలో కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ అంశంపైనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై విమర్శలకు దిగడంతో పాటు ఆక్సిజన్ కావాలంటూ డిమాండ్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త గందరగోళం ఏర్పడింది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు శనివారం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు 12 మంది నిపుణులతో కూడిన ఓ టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. దేశ వ్యాప్తంగా హేతుబద్ధతతో, అందరికీ సమానంగా ఆక్సిజన్‌ను పంపిణీ చేయాల్సిన బాధ్యతను వారి భుజ స్కంధాలపై మోపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 10 మంది వైద్యులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శితో పాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా ఉంటారు.
రాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాను ఈ కమిటీ చూసుకుంటుంది. కేవలం ఆక్సిజన్ మాత్రమే కాకుండా ప్రత్యేక ఔషధాలను కూడా సమానంగా పంపిణీ చేసే బాధ్యత కూడా ఈ కమిటీదే. ఈ రెంటితో పాటు కరోనాతో తలెత్తిన, తలెత్తబోయే కొత్త సవాళ్ల చిక్కుముళ్లపై కూడా ఈ టాస్క్‌ఫోర్స్ దృష్టి సారిస్తుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వీసీ డాక్టర్ భవతోష్ విశ్వాస్ నేతృత్వం వహిస్తారు. డాక్టర్ నరేశ్ టెహ్రాన్‌తో పాటు తమిళనాడు రాయవెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్, ముంబైలోని ఫోర్టిస్ ఆస్పత్రుల్లోని ప్రముఖ వైద్యులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉంటారని సుప్రీం పేర్కొంది. వీరితో పాటు నేషనల్ టాస్క్‌ఫోర్స్ కన్వీనర్‌గా కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ ఉంటారు. వీరు కూడా ఈ కమిటీలో సభ్యులే.