కరోనా రోగులకు భారీ ఊరటనిచ్చిన కేంద్రం…. భారీగా తగ్గిపోయిన రెమ్‌డెసివిర్ ధర

కరోనా కేసులు దేశంలో కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. ఆస్పత్రులన్నీ ఫుల్. ఎక్కడ చూసినా రోగులు. ఒక్కో బెడ్ పై ఇద్దరు చొప్పున రోగులు కూడా ఉన్నారు. మరోవైపు వ్యాక్సిన్ కొరత కూడా అధికంగానే ఉంది. అయితే కోవిడ్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను సిఫార్సు చేస్తున్నారు. ఎప్పుడైతే దీనికి డిమాండ్ పెరిగిందో బయట మార్కెట్‌లు చెలరేగిపోయాయి. దీని ధరను అమాంతం పెంచేశాయి. ధరను పెంచడమే కాకుండా బ్లాక్‌లో కూడా దీన్ని అమ్ముతున్నారు. రెమ్‌డెసివిర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, బ్లాక్‌లో అమ్మకుండా చూడాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దృష్ట్యా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా రోగులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రెమ్‌డెసివిర్ మందు ధరను 50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఈ ఔషధాన్ని తయారు చేసే మాన్యుఫ్యాక్చర్లతో కేంద్రం చర్చలు జరిపింది. దీంతోనే ఈ తగ్గింపు సాధ్యమైంది. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ ధర 2,450 రూపాయలుగా ఉంది. తగ్గింపు తర్వాత కేవలం 1,225 రూపాయలకే లభిస్తుంది. కరోనా కేసులు పెరగడం, ఆర్థిక స్థితిగతులు కూడా అంతంతే ఉన్న నేపథ్యంలో ఈ మందు ధర తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సవరించిన జాబితా ధరలు ఈ క్రింది విధంగా ఉంటాయి…
1. క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ రెమ్‌డాక్ రూ2,800 నుంచి 899 రూపాయలకు తగ్గింది.
2. సింజన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రెమ్‌విన్ 3,950 రూపాయల నుంచి 2,450 కి తగ్గింది.
3. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ రెడిక్స్ 5,400 రూపాయల నుంచి 2,700 కి తగ్గింది.
4. సిప్లా లిమిటెడ్ సిప్రెమి 4,000 రూపాయల నుంచి 3,000 కి తగ్గింది.
5. మైలాన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెస్రెమ్ 4,800 రూపాయల నుంచి 3,400 కి తగ్గింది.