రిలయన్స్ ఉద్యోగుల కుటుంబాలకు.. నీతా అంబానీ శుభవార్త

రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించనుంది. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులతోపాటు, వారి జీవిత భాగస్వామి, పిల్లలు తల్లిదండ్రులతో సహా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ టీకా పూర్తి ఖర్చులను తామే భరిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 టీకా కార్యక్రమానికి నమోదు చేసుకోవాలని ఉద్యోగులను నీతా అంబానీ కోరారు. రిలయన్స్ ఫ్యామిలీలో భాగమైన ఉద్యోగుల భద్రత, శ్రేయస్సు తన బాధ్యత అని ఉద్యోగులకు రాసిన ఈమెయిన్‌లో నీతా అంబానీ పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, ఆనందాన్ని కాపాడుకోవడమే ముఖేశ్ అంబానీ, తన బాధ్యత అని తెలిపారు. మహమ్మారి అంతం చివరి దశలో ఉన్నాం. కరోనా నిబంధనలు, జాగ్రత్తలు తీసుకుంటూనే మీ అందరి మద్దతుతో ఈ సామూహిక యుద్ధాన్ని గెలుద్దాం అని నీతా సందేశమిచ్చారు. రిలయన్స్ గ్రూప్‌తో పాటు దాని అనుబంధ సంస్థల లక్షలాది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.