వ్యాక్సినేషన్ లో ఇండియా…కొత్త రికార్డు

కరోనా వ్యాక్సినేషన్ కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే ఇండియా కొత్త రికార్డును అందుకుంది. రోజువారీ వ్యాక్సినేషన్లలో గత రికార్డును అధిగమించింది. 24 గంటల్లో ఏకంగా 69 లక్షల పైచిలుకు టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్రం ప్రకటించింది. టీకా విధానంలో భాగంగా దేశంలో వినియోగమయ్యే టీకాల్లో 75 శాతం కేంద్రమే సేకరిస్తూ, రాష్ట్రాల వాటాను ఉచితంగా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన 25 శాతాన్ని ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా టీకా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయవచ్చు. కాగా ఏప్రిల్ నెలలో చివరి సారిగా ఈ స్థాయిలో టీకా పంపిణీ జరిగింది. ఏప్రిల్ నెల 2న దేశ వ్యాప్తంగా 42,65,157 డోసులు పంపిణీ జరిగింది.
లాక్‍డౌన్ నిబంధనలు సడలిస్తున్న అనేక రాష్ట్రాలు రోజువారీ టీకా పంపిణీ లక్ష్యాలను క్రమంగా పెంచుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో రెండు లక్షల టీకా డోసులను వేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత తక్కువగా టీకాలు వేస్తున్న రాష్ట్రం అసోం కూడా టీకా కార్యక్రమం వేగాన్ని పెంచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రోజుకు 3 లక్షల టీకా డోసులు వేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇంతకుముందు రోజులో అత్యధిక వ్యాక్సిన్ల రికార్డు 43 లక్షలుగా ఉంది. ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానాల్లో వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్‍లు నిర్వహించారు.