2డీజీ ఔషధం విడుదల చేసిన రాజ్‍నాథ్ సింగ్

కొవిడ్ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‍డీవో) తయారు చేసిన కరోనా నివారణ ఔషధం 2డీజీ (2-డియాక్సి డి-గ్లూకోజ్) ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ విడుదల చేశారు. కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ ఈ ఔషధాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‍కు ఇవ్వగా, హర్షవర్థన్ దానిని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‍నాథ్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో ఈ ఔషధం ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి ఓ ఔషధాన్ని ఉత్పత్తి చేయడం ఆరోగ్యవంతమైన భాగస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రకటించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ 2డీజీ ఔషధంతో కొవిడ్ రికవరీ తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరం కూడగా తగ్గుతుందని అన్నారు. కోవిడ్‍పై పోరులో డీఆర్‍డీవో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. తొలి విడతలో 10 వేల సాచెట్లను అందుబాటులోకి తెచ్చారు. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేస్తామని, జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. అయితే దీని ధర డీఆర్‍డీవో ఇంకా ప్రకటించలేదు. కొవిడ్ పోరు ఈ ఔషధం అత్యవసర వినియోగానికి మే 1న డ్రాగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.