కరోనా బాధితులకు క్రికెటర్ల ఆపన్నహస్తం

దేశంలో సెకండ్‍వేవ్ కరోనాతో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు క్రికెటర్లు ముందుకు వచ్చారు. తమవంతుగా విరాళాను ప్రకటించారు. మరోవైపు ఐపిఎల్‍లో ఆడుతున్న టీమ్‍లు కూడా విరాళాలను అందజేస్తున్నాయి. రాజస్తాన్ రాయల్స్ ఇందుకోసం రూ. 7.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్ యాజమాన్యం అందరి భాగస్వామ్యం ఉన్నట్లు రాయల్స్ ప్రకటించింది. తాము ఇచ్చిన నిధులు ప్రధానంగా రాజస్తాన్ రాష్ట్రంలో ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కూడా రూ. 1.5 కోట్లు ప్రకటించింది. టీమ్ సహ యజమానులు తమ జేఎస్‍డబ్ల్యూ ఫౌండేషన్, వరలక్ష్మి ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందిస్తున్నారు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా తన వంతుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చాడు. కోవిడ్ రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత స్థితిలో దానిని నివారించేందుకు అతను సహాయం అందించనున్నాడు. 250 మంది సభ్యుల ఒక యువ బృందం మిషన్ ఆక్సిజన్ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. నా వైపునుంచి వారికి విరాళం ఇచ్చాను అని ప్రకటించిన సచిన్ ఎంత మొత్తం అనేది అధికారికంగా చెప్పకపోయినా కోటిరూపాయలు ఉండవచ్చని చెబుతున్నారు.
సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి కూడా విరాళం అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. దేశంలో ఆక్సిజన్ కొరతతో కోవిడ్ బాధితులు అల్లాడుతున్న వేళ ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళమిచ్చాడు. ఈ విషయాన్ని డొనాటేకర్ట్ అనే చారిటి ఆర్గనైజేషన్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అత్యవసర సమయంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ తన వంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్ఫండ్‍కు అందజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ సైతం1 బిట్‍కాయిన్‍ను విరాళంగా అందించనున్నట్లు తెలిపారు.