ఇదే చివరిది కాదు… రాబోయే మరింత ప్రమాదకరం

భవిష్యత్తులో మానవాళికి సోకే వైరస్ ప్రస్తుత కరోనా కంటే మరింత ప్రాణాంతకం, మరింత తీవ్రమైన వ్యాపించవచ్చని కోవిషీల్డ్ టీకా రూపకర్త, ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ హెచ్చరించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా సారా గిల్బర్డ్ పనిచేస్తున్నారు. మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్ చిట్టచివరిది కాదు. మున్ముందు ఇంత కంటే ప్రమాదకరమైంది రావచ్చు. ఆ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందేది, ప్రమాదకరమైంది అయి ఉండొచ్చు. అయితే ఇప్పటి మాదిరి పరిస్థితులనే మున్ముందు దాపురించే అవకాశం రానీయవద్దు. ప్రస్తుతం సాధించిన విజయాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది అని ఆమె తెలిపారు. పూర్తి సమాచారం తెలిసే వరకు కొత్త వేరియంట్ల వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ టీకా రెండు డోసులు అందకముందే బూస్టర్ డోసు గురించి యోచించడం సరికాదని భారత్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి డాక్టర్ రొడెరికో ఓప్రిన్ అభిప్రాయపడ్డారు. యావత్ జనాభాకు వ్యాక్సినేషన్ చేయడం ద్వారానే కరోనా వ్యాప్తికి కళ్లెం వేయొచ్చనే భారత విధానం సరైందని ఆయన ప్రశంసించారు.