కోవిడ్ కు చెక్ పెట్టనున్న నోటి మందు

కోవిడ్ వైరస్ ను ఏ విధంగానైనా అరికట్టేందుకు అమెరికా శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వైరస్ పూర్తిస్థాయి నియంత్రణకు నోటి మందు మోల్నూపిరవిర్‍ను రూపొందించారు. ముందుగా దీనిని క్షీరదాలలో ప్రయోగించి చూడగా, ఈ యాంటీవైరల్ మందు సమర్థవంతంగా పనిచేసిందని నిర్థారణ అయింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ ఫెరెట్ క్షీరదాలలో వైరస్‍ను నియంత్రించిందని అధ్యయనాలలో వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలను జర్నల్ నేచర్ మైక్రోబయాలజీలో ఇప్పుడు ప్రచురించారు.
జార్జియా స్టేట్ యూనివర్శిటీతో పాటు పలువురు పరిశోధకులు తమ అధ్యయన క్రమంలో ఈ నోటి మందును రూపొందించారు. దీనికి శాస్త్రీయంగా ఎంకె 4482/ఇఐడిడి 2801 అని పేరు పెట్టారు. సాధారణంగా ఇంఫ్లూయెంజా వైరస్‍ల నిరోధకానికి బాగా పనిచేస్తున్నట్లు తేలిన ఈ ఓరల్ డ్రగ్గ్ ఇప్పుడు కొవిడ్ వైరస్ వ్యాప్తిని కూడా అత్యంత వేగవంతంగా అరికడుతుందని నిర్థారించారు. శరీరంలోకి పాకిన వైరస్ వ్యాప్తిని నోటి ద్వారా పంపించే ఈ మందుతో అరికడుతుందని, ఈ విధంగా కరోనా వైరస్ నివారణ క్రమంలో సరికొత్త వైద్యచికిత్సకు రంగం సిద్ధం అయినట్లుగా భావిస్తున్నట్లు జర్నల్‍లో తెలిపారు. ఇప్పటివరకూ కరోనా కట్టడికి కేవలం టీకా మందునే మార్గంగా ఎంచుకున్నారు. ఈ దిశలోనే ప్రయోగాలు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాము ఎంచుకున్న ఈ నోటి మందుతో ఇప్పటివరకూ ఉన్న వైరస్ చికిత్సలో అపూర్వ మార్పు చోటుచేసుకుంటుందని అధ్యయనకర్తలలో ఒకరైన పరిశోధకులు రిచర్డ్ ప్లెంపెర్ తెలిపారు. అయితే దీనిని మనుష్యులలో పరీక్షించి ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది.