బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కరోనా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొవిడ్ 19 బారినపడ్డారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్‍లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్‍కు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని నడ్డా తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. తనను కొద్ది రోజులుగా కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నడ్డా కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిన వెంటనే పలువురు బీజేపీ నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు. వారిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా తదితరులు ఉన్నారు.