గుడ్ న్యూస్..అందుబాటులోకి మరో వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ పక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో మరో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. టీకాను అత్యవసర వినియోగానికి వాడవచ్చునని కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనా బారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసింది. ఈ సంస్థ జాన్సన్ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తోనే కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం దక్కిన విషయం తెలిసిందే.







