భారత్ కొంప ముంచిన తప్పుడు అంచనా!

భారత్‌లో కరోనా మహమ్మారి జడలు విప్పిన భూతంలా విస్తరిస్తోంది. సెకండ్‌వేవ్ పంజాకు దేశం మొత్తం విలవిల్లాడుతోంది. అయితే ఈ సంక్షోభానికి తప్పుడు అంచనాలే కారణమని తేల్చేశారు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణులు, బైడెన్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ. భారత్ తప్పుడు అంచనా వేయడం వల్లే ఇప్పుడు దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. వైరస్‌ను కట్టడి చేశామనే తొందరపాటులో సాధారణ జీవనానికి వెళ్లిపోవడం కొంప ముంచిందని ఫౌసీ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో వైరస్ పంజా విసిరిందని చెప్పారు.
మహమ్మారుల విషయంలో ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదనే విషయాన్ని భారత్ అనుభవపూర్వకంగా నిరూపించిందన్నారు ఫౌసి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక్కసారిగా మహమ్మారి విరుచుకుపడటంతో చాలా రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్, ఆక్సిజన్, మందులు దొరకని దయనీయ పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అందుబాటులో లేరన్నారు.
భారత్ లో మొదటి దశ కంటే రెండవ దశలో వైరస్ విజృంభిస్తోంది. భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. అయితే దేశంలో కరోనా వైరస్ బెడద లేదనుకొని వ్యవస్థలన్నింటిని తెరవడం వల్లే ఇప్పుడు దారుణమైన పరిస్థితులు ఎదురు అవుతున్నాయన్నారు ఫౌసీ. భారత్‌లో పరిస్థితులను చూస్తే ప్రజారోగ్యంపరంగా ఎలా సన్నద్ధమవ్వాలనే విషయం అర్థమవుతోందన్నారు. భారత్‌లో కరోనాను కంట్రోల్ చేయాలంటే.. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని.. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను విస్తరించాలని సూచించారు.
అంతర్జాతీయ నిపుణులందరూ భారత్ లో కరోనా వైరస్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీకా కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయడం, లాక్ డౌన్ లాంటి కట్టడి చర్యల ద్వారా వైరస్ కు ముకుతాడు వేయడం లాంటి నివారణ చర్యల ద్వారానే మేలు జరుగుతుందంటున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు లాక్ డౌన్ నడుస్తోంది. కానీ టీకాలు మాత్రం అందుబాటులో లేవు. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి.