ఈ లాక్‌డౌన్ లు, కర్ఫ్యూలు ఇంకెన్నాళ్లు..?

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. దాదాపు దేశమంతా అప్రకటిత లాక్ డౌన్ అమలవుతోంది. పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించుకోగా.. కొన్ని రాష్ట్రాల కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణలో రోజులో 20 గంటల లాక్‌డౌన్…. ఏపీలో 18 గంటల కర్ఫ్యూలతో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే ఈ ఆంక్షలు ఎంత కాలం కొనసాగుతాయి. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఏమంటున్నాయి.
కరోనా పాజిటివిటీ 10శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8వారాల పాటు లాక్‌డౌన్ విధించాలని భారత వైద్య పరిశోధనా మండలి, ICMR సూచించింది. అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గినపుడే ఆంక్షలను సడలించాలని స్పష్టం చేశారు ICMR చీఫ్ బలరాం భార్గవ.
ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు ప్రమాదకరంగా ఉంది. అక్కడ గత పది రోజులుగా ప్రతీ రోజు 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు నమోదు అవుతోంది. గడచిన 24 గంటల్లో పాజిటివిటీ రేటు 24 శాతంగా నమోదైంది. ICMR నిర్థేశించిన దాని కంటే రెట్టింపు పాజిటివిటీ రేటు ఏపీలో ఉంది. ఏపీలో మొత్తం 13 జిల్లాలు ఉండగా ఇందులో 11 జిల్లాలో పాజిటివిటీ రేటు 20 శాతానికి పైగానే ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది.
అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 9 శాతం పాజిటివిటీ రేటు ఉంది. తెలంగాణలో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే రిపోర్టులు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ఏకంగా లక్షన్నర మంది కోవిడ్ లేదా కోవిడ్ సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలింది. వీరందరికీ కోవిడ్ కిట్లు ఇచ్చి ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇంటింటి సర్వేలో వెల్లడైన వాస్తవాల ప్రకారం తెలంగాణలో సైతం పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణలో పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగానే ఉన్నందున లాక్‌డౌన్, పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు ముందుగా ప్రకటించిన తేది కంటే మరికొన్ని వారాల పాటు అధికంగా కొనసాగే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రం మొత్తం ఈ ఆంక్షలు కొనసాగుతాయా లేదా జిల్లాలను యూనిట్‌గా తీసుకుని పాజిటివిటీ రేటు ఎక్కువగా జిల్లాలకే ఈ ఆంక్షలు పరిమితం చేస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.