రెమ్‍డెసివిర్ ఇంజక్షన్ ల పై … కేంద్రం కీలక నిర్ణయం

రెమ్‍డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్‍సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెమ్‍డెసివిర్ ఇంజక్షన్లు చాలా నిల్వ ఉన్నాయన్నారు. వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా నెల రోజుల్లోనే 20 నుంచి 60కి పెరిగినట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని చుట్టుముట్టినప్పుడు చికిత్సలో రెమ్‍డెసివిర్ ఔషధం కీలకంగా మారింది. ఏప్రిల్ 11న రోజుకు 33 వేల వయల్స్ మాత్రమే ఉత్పత్తి కాగా, ఇప్పుడా సంఖ్య 3.50 లక్షలకు పెరిగిందని అన్నారు. కా•ట్టి వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అత్యవసరాల కోసం మాత్రం కేంద్రం 50 లక్షల రెమ్‍డెసివిర్ వయల్స్ను సమకూర్చుకోవాలని నిర్ణయించిందన్నారు.
రెమ్‍డెసివిర్‍కు గత నెలలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఈ యాంటీ వైరల్ ఇంజక్షన్ ధరను తగ్గించి ప్రభుత్వం రెమ్‍డెసివిర్, దాని తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దిగుమతి సుంకం మాఫీ అమలు ఈ ఏడాది అక్టోబరు 31 వరకు అమల్లో ఉంటుంది. ఇటీవల కరోనా చికిత్స నుంచి రెమ్‍డెసివిర్ మందును ఐసీఎంఆర్ తొలగించింది.