అందరికీ వ్యాక్సిన్.. ఫ్లోరిడాకు పోటెత్తిన ప్రజలు!

ఫ్లోరిడా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోయాయి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు సొంతగా కరోనా వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాయి. దీంతో ఈ పరిస్థితి చాలా వరకూ అదుపులోకి వచ్చింది. అయితే చాలా దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రాలేదు. కేవలం వృద్ధులు, వైద్య సిబ్బంది వంటి ఫ్రంట్ లైన్ వారియర్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలి విడతలో భాగంగా వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాలో ఓ వింత దృశ్యం చోటు చేసుకుంది. ఇక్కడి దక్షిణ ఫ్లోరిడాలో ఏర్పాటు చేసిన ఒక ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్(ఫెమా) వ్యాక్సినేషన్ కేంద్రం ముందు ప్రజలు క్యూ కట్టారు. దీనికి ఓ కారణం ఉందండోయ్.. ఇక్కడ శనివారం నాడు కొంత మంది యువకులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోయింది. దీంతో అర్హతతో సంబంధం లేకుండా ఈ ఫెమా కేంద్రంలో అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారనే వార్త ఆ ప్రాంతం మొత్తం వ్యాపించింది. దీంతో ఇక్కడకు ప్రజలు పోటెత్తారు. ఈ ఫెమా కేంద్రం ముందు భారీగా క్యూ కట్టారు.
అసలు ఏం జరిగింది?
కరోనా కేసులు తీవ్రంగా నమోదు అవుతుండటంతో మియామి, ఓర్లాండో, టంపా, జాక్సన్ విల్లె తదితర ప్రాంతాంల్లో వ్యాక్సిన్ అందించేందుకు అమెరికా ప్రభుత్వం ఫెమా సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు రెండు శాటిలైట్ సైట్లను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 500 వ్యాక్సిన్ డోసులు ఇచ్చే సామర్థ్యం ఉన్న ఈ శాటిలైట్ కేంద్రాలు.. ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా వారానికి ఓ ప్రాంతంలో ప్రజలకు వ్యాక్సిన్ అందజేస్తాయి. ఇలా ఫ్లోరిడాకు వచ్చిన ఈ శాటిలైట్ సెంటర్లో శనివారం నాడు చాలా తక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో చాలా వ్యాక్సిన్ డోసులు మిగిలిపోయాయి. అదే సమయంలో కొంత మంది వ్యాక్సిన్ తీసుకునే అర్హత లేని ప్రజలు అక్కడకు వచ్చారు. అది చూసిన డాక్లర్లు ‘సరే ఏం పోయింది? వీళ్లకే ఇచ్చేద్దాం’ అని అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ విషయం తెలిసి ఈ కేంద్రానికి జనం పోటెత్తారు. దీంతో ఆ రోజు ఫెమా కేంద్రం ఏకంగా 483 వ్యాక్సిన్ డోసులు అందజేసింది. ఇప్పటి వరకూ ఈ కేంద్రం ఇచ్చిన కరోనా డోసుల్లో ఇదే అత్యథికం. ఈ విషయం తెలిసి ఆ మరుసటి రోజు కూడా ప్రజలు ఇక్కడకు భారీగా తరలివచ్చారు. అయితే పరిస్థితి అర్థం చేసుకున్న ఈ ఫెమా కేంద్రం సిబ్బంది, పోలీసులు.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు వివరిస్తూ గవర్నర్ రాన్ డిసాంటి జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను చూపిస్తూ ప్రజలను శాంతపరిచారు. ఎలిజిబుల్ కానీ వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వకుండానే వెనక్కు పంపేశారు. దీంతో రెండో రోజు ఇక్కడ అర్హత కలిగిన 321 మందికే వ్యాక్సిన్ అందజేశారు.
ఫ్లోరిడాలో ఎందుకిలా?
కరోనా వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలో అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఒక స్పష్టత ఉంది. ఫ్లోరిడాలో మాత్రం దీనిపై స్పష్టత లేదు. వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో ప్రాధాన్యతా క్రమాన్ని ఇక్కడి ప్రభుత్వం విడుదల చేయలేదు. గతవారమే నిబంధనలు సడలించిన ప్రభుత్వం.. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమసయలు ఉన్న వాళ్లు, డాక్టర్ల నోట్ ఉన్నవాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే పోలీసులు, టీచర్లు, ఫైర్‌ఫైటర్ల కనీస అర్హత వయసును కూడా 50 సంవత్సరాలకు తగ్గించింది. అయితే యువకుల పరిస్థితి ఏంటి? అనే విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగానే ఫ్లోరిడాలో వ్యాక్సిన్ అందరికీ ఇస్తున్నారు అనగానే ప్రజలందరూ ఇలా ఎగబడ్డారు. ఇప్పటికైనా ఇక్కడి ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు వాదిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ నోట్ కావాలంటే 3వేల డాలర్ల విలువైన టెస్టులు చేయించుకోవాలని, అయితే ఇవి చేయించుకోవడానికి మెడికల్ ఇన్సూరెన్స్ పనిచేయడం లేదని కొందరు బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ నోట్ తెచ్చుకోవడం చాలా మందికి అసాధ్యం అవుతుందని చెప్తున్నారు.