రెండు డోసులు తీసుకున్నా… మాస్క్ లు

టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ, మాస్కులు ధరించాల్సిందేనని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‍దీప్ గులేరియా స్పష్టం చేశారు. వైరస్ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే ఏ వేరియంట్ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.
దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయడం ఒకటి లేదా రెండు నెలల్లో సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే, రెండు నెలల్లో పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ లభించనున్నదని, అప్పుడు చిన్నారులకు కూడా వ్యాక్సిన్లు వేసే స్థాయికి చేరుకుంటామన్నారు. కరోనా వైరస్ ఇన్‍ఫెక్షన్‍కు గురైతే వృద్ధులు, తక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉన్న రోగులు చనిపోయే అవకాశం ఉన్నదని చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో అలాంటి వారికి టీకాలు వేయడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.
పూర్తిగా టీకాలు తీసుకున్నవారు మాస్క్లు లేకుండా బయటకు వెళ్ళవచ్చని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ గులేరియా ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవహరించాల్సి అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.