వ్యాక్సిన్లతో కరోనా మరణాలకు… అడ్డుకట్ట
కరోనా వ్యాక్సిన్లు వైరస్ నుంచి బలమైన రక్షణ కల్పిస్తున్నాయని అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో కొవిడ్‌తో ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య, మరణాలు తగ్గాయన్నారు. మొత్తం 8 (మోడెర్నా, ఫైజర్, నోవావ్యాక్స్, కొవిషీల్డ్, సినోఫార్మ్, సినోవ్యాక్, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్-వి) కరోనా టీకాల సమాచారాన్ని విశ్లేషించగా దీన్ని గుర్తించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ల వినియోగంతో సగటున బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్ నుంచి 86 శాతం, బ్రెజిల్ స్ట్రెయిన్ నుంచి 61 శాతం, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ నుంచి 56 శాతం మేర రక్షణ లభిస్తోందన్నారు. కరోనా ఇన్పెక్షన్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా సంక్రమించకుండా అడ్డుకట్ట వేయడంలో టీకాలు 54 శాతం ప్రభావశీలతను చూపుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో 94 శాతం సమర్థతతో ఫైజర్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో మోడెర్నా (80 శాతం), జాన్సన్ అండ్ జాన్సన్ (65.5 శాతం), కొవిషీల్డ్ (50 శాతం) ఉన్నాయన్నారు.







