వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చిన భయం లేదు

కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా పలు చోట్ల పలువురు కరోనా బారిన పడినట్లు వార్తలు రావడంతో చాలామంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై వైద్యనిపుణులు స్పందిస్తూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. టీకా పొందిన తర్వాత కూడా కరోనా వైరస్ బారిన పడటం సర్వసాధారణమే అని పలువురు నిపుణులు పేర్కొంటూ, కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నాక శరీరంలో దాని ప్రభావం చూపేందుకు పది నుంచి 14 రోజుల సమయం పడుతుందని అన్నారు. అప్పుడు కూడా కేవలం 50 శాతానికి పైగా మాత్రమే రోగనిరోధకత వస్తుంది. రెండో డోసు తీసుకున్న తర్వాతే పూర్తి రోగనిరోధకత వస్తుందని స్పష్టంగా వారు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ అనేది పూర్తిగా వైరస్ శరీరాన్ని ప్రభావితం చేయకుండా బలహీనం మాత్రమే చేస్తుందని.. వైరస్ పూర్తిగా రాకుండా కాదని వారు వివరించారు. ఇప్పటివరకు ఆమోదించబడిన అన్నివ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే వ్యాక్సిన్లు కావన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మనిషికి వైరస్ సోకినా అంత హానికరం కాదని వివరిస్తున్నారు. వ్యాక్సిన్ అనేది కరోనా వైరస్ తీవ్రత, మరణించే అవకాశాలను తగ్గిస్తుందే కానీ సంక్రమించే ప్రక్రియను ఆపలేదన్నారు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉంటారు కాబట్టి టీకాలు వేయడం అవసరమే అని చెన్నైకి చెందిన జీవ శాస్త్రవేత్త డా.శంకరన్ కష్ణస్వామి అంటున్నారు. నిజంగా చెప్పాలంటే వ్యాక్సిన్లు అనేవి వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఉద్దేశించినవే కానీ కొన్నిసార్లు రోగనిరోధక శక్తిని పెంచడానికే వాడతామని గుర్తుచేశారు.