కరోనా కేసులు తగ్గుముఖం?

మృతుల సంఖ్య తగ్గుతున్నట్టు అమెరికా అధికారుల వెల్లడి
వాషింగ్టన్‍ః దేశంలో మూడు నెలల క్రితం ప్రారంభించిన వ్యాక్సినేషన్ క్రమంగా సత్ఫలితాలనిస్తున్నట్టు అమెరికాలో సంబంధిత అధికారులు చెబుతున్నారు. 65 ఏళ్లు పైబడినవారిలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, క్రమంగా మరణాల సంఖ్య కూడా రోజుకు వెయ్యికి మించి ఉండడం లేదని వారు వెల్లడించారు. నవంబర్ నాటి నుంచి మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని, మొదటిసారిగా దేశంలో మరణాల సంఖ్య ఈ నెలలో వెయ్యి కంటే బాగా తగ్గిందని వారు వివరించారు.
దాదాపు రాష్ట్రాలన్నీ పోటాపోటీగా వృద్ధులకు వ్యాక్సిన్ వేస్తున్నాయని, వచ్చే కొద్ది వారాలలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయి, ఇతర వయోజనులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభం అవుతుందని వారు తెలిపారు. వైట్‍హౌస్ అధికారులు అందజేసిన సమాచారం ప్రకారం, వచ్చే వారం ఒక షాట్, రెండు షాట్ల కోసం సుమారు 2.7 కోట్ల డోసులను పంపిణీ చేయడం జరుగుతుంది. అధ్యక్షుడుగా జో బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యాక్సిన్ డోసుల సరఫరా మూడు రెట్లు పెరిగింది.
అయితే, ప్రభుత్వంలో అంటువ్యాధుల నిపుణుడైన డాక్టర్ ఆంథొని ఫాసీ మాత్రం, దీన్ని కరోనా మహమ్మారి నుంచి దేశం గట్టెక్కినట్టుగా భావించకూడదని వ్యాఖ్యానించారు. కరోనా నుంచి గట్టెక్కడంలో ఇది మొదటి మెట్టు మాత్రమేనని, పూర్తిగా కోలుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుందని ఆయన అన్నారు. ‘‘మనం ఇంకా మొదటి మెట్టు మీదే ఉన్నాం. ఈ గండం ఎప్పుడు గడుస్తుందో ఇప్పుడే చెప్పలేం’’ అని ఫాసీ అన్నారు.
ఐరోపా దేశాలతో పోలిస్తే కరోనాను నియంత్రించడంలో అమెరికా చాలా మెరుగైన స్థితిలోనే ఉన్నట్టు భావించవచ్చు. బ్రెజిల్‍లో మంగళవారం నాడు ఒక్క రోజునే 3,000 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇతర ఐరోపా దేశాలలో కూడా ఈ వైరస్ ఇంకా విలయ తాండవం చేస్తూనే ఉంది. ఆ దేశాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో మళ్లీ లాక్‍డౌన్‍లు ప్రకటించడం కూడా ప్రారంభమైంది. అక్కడ వ్యాక్సిన్ సరఫరా మందకొడిగా సాగుతుండడంతో పాటు, ఆస్ట్రాజెన్‍కా వ్యాక్సిన్ మీదే అనుమానాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
నిర్లక్ష్య ధోరణి వద్దు
కాగా, కేసులు తగ్గుతున్నంత మాత్రాన మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కట్టుబాట్లకు స్వస్తి చెప్పవద్దని అమెరికాలో అధికారులు పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను సడలించడం, భారీ సంఖ్యలో విమాన ప్రయాణాలు చేస్తుండడం, ఫ్లోరిడా వంటి ప్రాంతాలలో జనం విందులు వినోదాల్లో ముణిగి తేలుతుండడం వంటి చర్యల వల్ల కొన్ని రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న విషయాన్ని స్క్రిప్ రిసెర్చ్ ట్రాన్స్లేషనల్ అధిపతి డాక్టర్ ఎరిక్ టోపోల్ గుర్తు చేశారు.
ఏది ఏమైనా, దేశం మొత్తమ్మీద కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయనడానికి మాత్రం దాఖలాలు కనిపిస్తున్నాయి. 65 ఏళ్లు పైబడినవారిలో 43 శాతం మంది కరోనా బారిన పడడానికి అవకాశం ఉన్నవారే. ఇంత వరకూ నమోదైన 5,40,000 మంది కరోనా మృతుల్లో పెద్ద వాటా 65 ఏళ్లు పైబడినవారిదే. అయితే, వృద్ధ తరంలో దాదాపు 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 25 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నట్టు అధికారిక అంచనా.
జనవరి మధ్య నాటికి కూడా 3,400కు పైగా ఉన్న కరోనా మృతుల సంఖ్య ప్రస్తుతం రోజుకు 940కు తగ్గిందని వైట్‍హౌస్ అధికారులు చెప్పారు. మిన్నెసోటాలో ప్రస్తుతం ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదని అక్కడి ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. ‘‘ఈ వ్యాక్సిన్‍లు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మరింతగా కేసులు తగ్గుతాయనడంలో సందేహం లేదు’’ అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్‍స్కీ చెప్పారు.
కాగా, గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుతోందని రికార్డులు తెలియజేస్తున్నాయి. గతంలో రోజుకు సగటున అయిదు లక్షల చొప్పున కరోనా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 53,000లకు తగ్గిపోయింది. అయితే, బ్రిటన్ నుంచి వ్యాప్తి చెందిన కరోనా కొత్త రూపం మాత్రం దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ కనిపిస్తోందని అధికారులు తెలిపారు.